మూడు వేల అడుగులతో రక్తపోటు నియంత్రణ
రోజుకు మూడువేల అడుగులు వేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, అధిక రక్తపోటును తగ్గించవచ్చని తాజా అధ్యయనం కనుగొంది. రక్తపోటు నిపుణుడు అయిన పెస్కాటెల్లో.. అయోవా స్టేట్ యూనివర్సిటీలో డక్ చున్ లీ ల్యాబ్‌లో ఎలిజబెత్ లెఫెర్ట్స్ అనే మరికొంతమంది పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు.
రక్తపోటుకు సంబంధించి వారు చేసిన ఈ పరిశోధన జర్నల్ ఆప్ కార్డియోవాస్కులర్ డెవలప్‌మెంట్ అండ్ డిసీజ్‌లో ప్రచురితమైంది. వయసుపైబడిన వారు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. వీరు ఈ వయసులో రోజూ చేసే వాకింగ్ సమయాన్ని పెంచడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా లేదా అన్న కోణంలో ఈ పరిశోధన చేశారు. అయితే తాజా అధ్యయనానికి ముందు రోజుకు సగటున నాలుగు వేల అడుగులు వేసిన వృద్ధులపై అధ్యయనం చేశారు. అయితే నాలుగువేల అడుగులు అంటే మరీ ఎక్కువ సమయం పడుతుండటంతో ఎక్కువ శారీరక శ్రమ వల్ల వారు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకని రక్తపోటు నియంత్రణకు రోజుకు సగటున 3 వేల అడుగులు నడవడం సహేతుక లక్ష్యమని పరిశోధకులు నిర్ణయించారు.
కోవిడ్ మహమ్మారి ఉన్న సమయంలోనే ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులకు పెడోమీటర్లు, రక్తపోటు మానిటర్లు, స్టెప్ డైరీలతో కూడి ఓ కిట్‌ను పరిశోధకులు వారికిచ్చారు. రోజూ వారు ఎన్ని వేల అడుగులు వేస్తున్నారో పరిశీలించారు. ఇందులో పాల్గొన్న 21 మందిలో ఎనిమిది మంది అధిక రక్తపోటు నిరోధక మందులు వాడుతున్నారు. వీరంతా రోజూ చేసే వాకింగ్ సమయాన్ని మరికొంతసేపు పెంచడం వల్ల.. రక్తపోటు నియంత్రణలో ఉందని పరిశోధకులు గమనించారు. ఈ అధ్యయనంలో రక్తపోటు నియంత్రణకు శారీరక శ్రమ ముఖ్యమని పరిశోధకులు కనుగొన్నారు.
No comments:
Post a Comment