Thursday, August 1, 2024

 రాత్రంతా ఏసీ గదిలోనే నిద్రిస్తున్నారా..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు మానవాళి పాలిట ఓ మహమ్మారిగా మారుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఇక గత కొద్ది రోజులుగా ప్రపంచంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని యూరోపియన్ కాపర్నికస్ నెట్వర్క్ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఇవి 50 డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రజలు ఏసీల వైపు మళ్లుతున్నారు కొందరు గంటలకు గంటలు ఏసీ గదుల్లోనే గడిపేస్తున్నారు. ఏసీలు ఆన్‌లో ఉంచే నిద్రిస్తున్నారు. అయితే, ఇలాంటి పనులతో సమస్యల పాలవ్వాలని వైద్యులు  హెచ్చరిస్తున్నారు.

ఏసీ గదుల్లోని గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఫలితంగా కళ్లు పొడిబారతాయి. చివరకు దురదలు, ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లని గదుల్లో ఉంటే జీవక్రియలు నెమ్మదిస్తాయి. దీంతో, మత్తుగా, నిద్ర, లేదా అలసట ఆవరించినట్టు అనిపిస్తుంది. ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉంటే శరీరం తేమ అధికంగా కోల్పోయి డీహైడ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. గాల్లో తేమలేకపోవడంతో చర్మ సంబంధిత సమస్యలూ వస్తాయి. దురదలు, పొలుసులు ఊడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏసీ ఆన్ చేసినప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత, గాల్లో తేమ తగ్గిపోయి తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. ఏసీ గదుల్లో తేమలేని, చల్లని గాలి కారణంగా ఆస్తమా, ఎలర్జీ లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇక ఏసీ ధ్వని కారణంగా రాత్రుళ్లు నిద్ర చెడిపోయే అవకాశం కూడా ఉంది.
ఏసీ నిర్వహణ సరిగా లేని సందర్భాల్లో దుమ్ము, పోలెన్, బూజు వంటి వాటితో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏసీ కారణంగా గదిలో దుమ్మూధూళి వంటివి పోగుబడి సమస్యలకు దారి తీయొచ్చు.

ఏసీ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నవజాత శిశువులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనీసం 20 నిమిషాల ముందే ఏసీ ఆన్ చేసి గదంతా సమతుల వాతావరణం ఏర్పడ్డాకే చిన్నారులను గదిలోకి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీ నుంచి చల్లటి గాలి నేరుగా పిల్లలకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఏసీ ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలి.


No comments:

Post a Comment