Tuesday, September 17, 2024

సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగానే నిద్రలేవడం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి తినడం, నిద్రపోవడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవితానికి చాలామంది ఇప్పుడు దూరమవుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. సూర్యోదయానికి ముందు ఒక గంట నిద్ర లేవడం వల్ల ఆరోజు చేయాల్సిన పనులను త్వరగా చేసుకోవడంతోపాటు, ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా..

సూర్యోదయానికి ఒక గంట ముందు నిద్రలేచి.. కళ్లు మూసుకుని, కాసేపు నిటారుగా కూర్చుంటే.. ప్రేగు కదలికలు జరిగి శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి అని వైద్యులు చెబుతున్నారు.

– శరీరంలో వ్యర్థాలు తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

– బ్యాక్టీరియా కానీ, ఆల్కహాల్‌, అరుగుదల కోసం వేసుకునే మందులు, మృతకణాలు కానీ ఇలా ఏవైనా.. శరీరం నుంచి తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

– ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.


 చక్కని ఆరోగ్యానికి చల్లని పానీయాలు


ప్రకృతి పానీయాల గురించి తెలుసుకుని తాగితే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి కొన్ని ప్రకృతి సిద్ధమైన పానీయాల గురించి తెలుసుకుందాం.


నిమ్మాపుదీనా జ్యూస్‌ :

సోడాలంటే చాలామందికి ఇష్టం. కానీ బయట దొరికే సోడాలన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మా పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాస్‌ నిమ్మాపుదీనా జ్యూస్‌ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. వాటిలోని 40 గ్రా.సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి.


ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ : 

ఎలక్ట్రోలైట్‌ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు డీ హైడ్రేషన్‌ నుంచి ఉపశమనాన్ని కల్గిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ ఒకటి. ఎండలో బాగా కష్టపడే వారికి, ఎక్కువగా అలసటకు గురయ్యే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బొహైడ్రేట్స్‌ మీ శరీరానికి అందుతాయి. ఇది జీరో కొలస్ట్రాల్‌ డ్రింక్‌.

దానిమ్మ రసం :

ఇంట్లో రెండే రెండు నిముషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఈ రసంలో 18.5 గ్రాముల కార్బొహైడ్రేట్స్‌, జీరో కొలెస్ట్రాలు ఉంటాయి.
వాటర్‌ మెలన్‌ చిల్లర్‌ : వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది పుచ్చకాయ. దీంతో, జ్యూస్‌ను చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ కాంబినేషన్‌లో తయారుచేసిన ‘వాటర్‌ మిలన్‌ చిల్లర్‌’ జ్యూస్‌ నోటికి రుచిగా ఉంటుంది. శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలెస్ట్రాలు ఉండవు. గ్లాసు వాటర్‌మిలన్‌ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బొహైడ్రేడ్స్‌, 1.1 గ్రాముల ప్రొటీన్‌ శరీరానికి అందుతుంది.


పుల్లటి వాటర్‌ : 

వేసవి ఈ పానీయం శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను ఉంచితో ఈ నీటిని పుల్లటి రుచి వస్తుంది. విటమిన్‌ సి కూడా అందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలుంటాయి. వేడి దద్దుర్ల నుంచి రక్షిస్తుంది.


నిమ్మకాయ, పుదీనా పానీయం : 

ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మముక్కలు ఉంచి 15 నిముషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనె కలపాలి. ఇది వేసవి వేడి, నిర్జలీకరణం నుంచి మనల్ని రక్షించడానికి దోహదపడుతుంది.


ఆరెంజ్‌ జ్యూస్‌ : 

ఆరెంజ్‌ నుంచి జ్యూస్‌ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్‌ సి, ఎలక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. నిర్జలీకరణ నుంచి రక్షిస్తుంది. ఇది కూడా ఉత్తమమైన ఆరోగ్యకరమైన వేసవి పానీయాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
వెన్నతీసిన పాలు : ఈ పానీయంలో ప్రొటీన్లు సమృద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. వేడిని తగ్గించటానికి ఇవి దోహదపడతాయి. దాహార్తిని తీరుస్తుంది. ఆకలి పెరుగుతుంది.

పెరుగు పానీయం : 

ఒక కప్పు పెరుగులో కొంత నీరు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ఉప్పు వేయాలి. ఈ పానీయం తయారుకావటానికి బాగా కలపాలి. దీనిలో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్‌). ఆక్సీకరణ, ఎలక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇది నిర్జలీకరణం నుంచి కాపాడుతుంది.

రోజ్‌ వాటర్‌ : 

నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గులాబీ రేకులు వేసి కొంచెంసేపు మరగించాలి. రాత్రిపూట అలా ఉంచి మరుసటి రోజు ఉదయం తేనె కలపాలి. ఈ సీజన్‌లో ఉత్తమ వేసవి పానీయాల్లో ఇది కూడా ఒకటి.


ఐస్‌తో బటర్‌మిల్క్‌ : 

కొంత పెరుగును తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. చల్లగా కావాలనుకుంటే కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ కూడా వేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకుంటే మనల్ని తాజాగా ఉంచుతుంది.


కర్బూజా, పుచ్చకాయ పానీయం : 

కర్బూజా, పుచ్చకాయ ముక్కలను జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ తీయాలి. దీనికి అర స్పూన్‌ తేనె, చిటికెడు ఉప్పు కలపాలి. కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కలపాలి. ఆ తర్వాత సేవిస్తే అధిక చెమటలను తగ్గిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.



  కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు


కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లేత కొబ్బరి నీళ్లలో అనేక సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌, పొటాషియం, సోడియం అత్యధికంగా ఉండి శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


– ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది.


– శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.


– మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఉన్న కొబ్బరి నీరు తాగడం వల్ల గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు తలెత్తవు.


– పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు ఈ పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు అనేక ఇన్‌ ఫెక్షన్ల నుంచి రక్షించబడతారు.


– పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

– కొబ్బరి నీరు మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో సహాయపడతాయి.

– రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

చర్మ సమస్యలు పోవాలంటే ….


వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఎక్కువ. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, ఉక్కపోత, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద ప్రధానంగా కన్పిస్తుంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగానే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు చర్మ వైద్య నిపుణులు.


- స్నానానికి ముందు ఒక స్పూన్‌ బేకింగ్‌ సోడాలో నిమ్మరసం పిండుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు మొత్తం శరీరానికి మర్దనా చేసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.


– ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేయాలి. ఆ నీళ్లను స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దురద సమస్యల్నించి గట్టెక్కవచ్చు.

– చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్నానానికి ముందు కొబ్బరినూనెను శరీరానికి మర్దన చేసుకుంటే చర్మానికి పోషక గుణాలు అందించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ నుంచి దూరం చేస్తుంది.

 మూడు వేల అడుగులతో రక్తపోటు నియంత్రణ 

రోజుకు మూడువేల అడుగులు వేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, అధిక రక్తపోటును తగ్గించవచ్చని తాజా అధ్యయనం కనుగొంది. రక్తపోటు నిపుణుడు అయిన పెస్కాటెల్లో.. అయోవా స్టేట్‌ యూనివర్సిటీలో డక్‌ చున్‌ లీ ల్యాబ్‌లో ఎలిజబెత్‌ లెఫెర్ట్స్‌ అనే మరికొంతమంది పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు. 

రక్తపోటుకు సంబంధించి వారు చేసిన ఈ పరిశోధన జర్నల్‌ ఆప్‌ కార్డియోవాస్కులర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిసీజ్‌లో ప్రచురితమైంది. వయసుపైబడిన వారు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. వీరు ఈ వయసులో రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని పెంచడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా లేదా అన్న కోణంలో ఈ పరిశోధన చేశారు. అయితే తాజా అధ్యయనానికి ముందు రోజుకు సగటున నాలుగు వేల అడుగులు వేసిన వృద్ధులపై అధ్యయనం చేశారు. అయితే నాలుగువేల అడుగులు అంటే మరీ ఎక్కువ సమయం పడుతుండటంతో ఎక్కువ శారీరక శ్రమ వల్ల వారు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకని రక్తపోటు నియంత్రణకు రోజుకు సగటున 3 వేల అడుగులు నడవడం సహేతుక లక్ష్యమని పరిశోధకులు నిర్ణయించారు. 

కోవిడ్‌ మహమ్మారి ఉన్న సమయంలోనే ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులకు పెడోమీటర్లు, రక్తపోటు మానిటర్లు, స్టెప్‌ డైరీలతో కూడి ఓ కిట్‌ను పరిశోధకులు వారికిచ్చారు. రోజూ వారు ఎన్ని వేల అడుగులు వేస్తున్నారో పరిశీలించారు. ఇందులో పాల్గొన్న 21 మందిలో ఎనిమిది మంది అధిక రక్తపోటు నిరోధక మందులు వాడుతున్నారు. వీరంతా రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని మరికొంతసేపు పెంచడం వల్ల.. రక్తపోటు నియంత్రణలో ఉందని పరిశోధకులు గమనించారు. ఈ అధ్యయనంలో రక్తపోటు నియంత్రణకు శారీరక శ్రమ ముఖ్యమని పరిశోధకులు కనుగొన్నారు.

  వీటిని తిన్న తర్వాత టీని ఎప్పుడూ తాగకూడదు…

టీ, కాఫీలు ప్రతిరోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ కొంతమందైతే.. టిఫిన్‌, భోజనం చేసిన తర్వాత కూడా టీ తాగుతూనే ఉంటారు. ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి కొన్నింటిని తీసుకున్న తర్వాత టీని అస్సలు తాగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా…!

సిట్రస్‌ ఫ్రూట్స్‌
లెమన్‌ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ లెమన్‌ టీ కాకుండా.. మాములు టీ తాగేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన రెసిపీలను తీసుకోకూడదు. ఎందుకంటే టీ, నిమ్మకాయ రెండూ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ రెంటినీ కలిపి తీసుకుంటే.. గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన పదార్థాల్ని తిన్న తర్వాత టీని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్‌ ఫుడ్స్‌
ఐరన్‌ ఉన్న ఫుడ్స్‌ని తీసుకున్నప్పుడు వెంటనే టీని తాగకూడదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

స్పైసీ ఫుడ్స్‌
స్పైసీ ఫుడ్స్‌ తిన్న తర్వాత టీని తాగకూడదు. స్పైసీ ఫుడ్స్‌ కడుపులో మంటను కలిగిస్తాయి. వీటితోపాటు టీని తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఐస్‌క్రీమ్‌లు
బాగా చల్లని పదార్థాలు తీసుకున్న తర్వాత కూడా టీని తాగకూడదు. ఐస్‌క్రీమలు లేదా కూల్‌డ్రింక్స్‌ తాగిన తర్వాత కనీసం అరంగంట తర్వాతనే టీ తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

  గొంతు గర గర పోవాలంటే …


ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో బ్యాక్టీరియా మన శరీరంపై దాడికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు తెగ ఇబ్బంది పెడతాయి. గొంతులో గరగరగా ఉందంటే మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ప్రవేశిస్తోందని, వాటిపై మన రోగ నిరోధక శక్తి పోరాడుతోందని అర్థం. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. దీన్ని సులభంగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


– గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్‌ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.
– అల్లాన్ని పేస్ట్‌ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీ పొడి కలిపి టీ పెట్టుకొని తాగాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
– అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
– పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, ఆకులు తీసివేసి, ఆ నీళ్లు తాగాలి.