Tuesday, September 17, 2024

చర్మ సమస్యలు పోవాలంటే ….


వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఎక్కువ. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, ఉక్కపోత, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద ప్రధానంగా కన్పిస్తుంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగానే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు చర్మ వైద్య నిపుణులు.


- స్నానానికి ముందు ఒక స్పూన్‌ బేకింగ్‌ సోడాలో నిమ్మరసం పిండుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు మొత్తం శరీరానికి మర్దనా చేసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.


– ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేయాలి. ఆ నీళ్లను స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దురద సమస్యల్నించి గట్టెక్కవచ్చు.

– చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్నానానికి ముందు కొబ్బరినూనెను శరీరానికి మర్దన చేసుకుంటే చర్మానికి పోషక గుణాలు అందించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ నుంచి దూరం చేస్తుంది.

 మూడు వేల అడుగులతో రక్తపోటు నియంత్రణ 

రోజుకు మూడువేల అడుగులు వేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, అధిక రక్తపోటును తగ్గించవచ్చని తాజా అధ్యయనం కనుగొంది. రక్తపోటు నిపుణుడు అయిన పెస్కాటెల్లో.. అయోవా స్టేట్‌ యూనివర్సిటీలో డక్‌ చున్‌ లీ ల్యాబ్‌లో ఎలిజబెత్‌ లెఫెర్ట్స్‌ అనే మరికొంతమంది పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు. 

రక్తపోటుకు సంబంధించి వారు చేసిన ఈ పరిశోధన జర్నల్‌ ఆప్‌ కార్డియోవాస్కులర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిసీజ్‌లో ప్రచురితమైంది. వయసుపైబడిన వారు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. వీరు ఈ వయసులో రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని పెంచడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా లేదా అన్న కోణంలో ఈ పరిశోధన చేశారు. అయితే తాజా అధ్యయనానికి ముందు రోజుకు సగటున నాలుగు వేల అడుగులు వేసిన వృద్ధులపై అధ్యయనం చేశారు. అయితే నాలుగువేల అడుగులు అంటే మరీ ఎక్కువ సమయం పడుతుండటంతో ఎక్కువ శారీరక శ్రమ వల్ల వారు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకని రక్తపోటు నియంత్రణకు రోజుకు సగటున 3 వేల అడుగులు నడవడం సహేతుక లక్ష్యమని పరిశోధకులు నిర్ణయించారు. 

కోవిడ్‌ మహమ్మారి ఉన్న సమయంలోనే ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులకు పెడోమీటర్లు, రక్తపోటు మానిటర్లు, స్టెప్‌ డైరీలతో కూడి ఓ కిట్‌ను పరిశోధకులు వారికిచ్చారు. రోజూ వారు ఎన్ని వేల అడుగులు వేస్తున్నారో పరిశీలించారు. ఇందులో పాల్గొన్న 21 మందిలో ఎనిమిది మంది అధిక రక్తపోటు నిరోధక మందులు వాడుతున్నారు. వీరంతా రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని మరికొంతసేపు పెంచడం వల్ల.. రక్తపోటు నియంత్రణలో ఉందని పరిశోధకులు గమనించారు. ఈ అధ్యయనంలో రక్తపోటు నియంత్రణకు శారీరక శ్రమ ముఖ్యమని పరిశోధకులు కనుగొన్నారు.

  వీటిని తిన్న తర్వాత టీని ఎప్పుడూ తాగకూడదు…

టీ, కాఫీలు ప్రతిరోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ కొంతమందైతే.. టిఫిన్‌, భోజనం చేసిన తర్వాత కూడా టీ తాగుతూనే ఉంటారు. ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి కొన్నింటిని తీసుకున్న తర్వాత టీని అస్సలు తాగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా…!

సిట్రస్‌ ఫ్రూట్స్‌
లెమన్‌ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ లెమన్‌ టీ కాకుండా.. మాములు టీ తాగేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన రెసిపీలను తీసుకోకూడదు. ఎందుకంటే టీ, నిమ్మకాయ రెండూ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ రెంటినీ కలిపి తీసుకుంటే.. గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన పదార్థాల్ని తిన్న తర్వాత టీని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్‌ ఫుడ్స్‌
ఐరన్‌ ఉన్న ఫుడ్స్‌ని తీసుకున్నప్పుడు వెంటనే టీని తాగకూడదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

స్పైసీ ఫుడ్స్‌
స్పైసీ ఫుడ్స్‌ తిన్న తర్వాత టీని తాగకూడదు. స్పైసీ ఫుడ్స్‌ కడుపులో మంటను కలిగిస్తాయి. వీటితోపాటు టీని తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఐస్‌క్రీమ్‌లు
బాగా చల్లని పదార్థాలు తీసుకున్న తర్వాత కూడా టీని తాగకూడదు. ఐస్‌క్రీమలు లేదా కూల్‌డ్రింక్స్‌ తాగిన తర్వాత కనీసం అరంగంట తర్వాతనే టీ తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

  గొంతు గర గర పోవాలంటే …


ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో బ్యాక్టీరియా మన శరీరంపై దాడికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు తెగ ఇబ్బంది పెడతాయి. గొంతులో గరగరగా ఉందంటే మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ప్రవేశిస్తోందని, వాటిపై మన రోగ నిరోధక శక్తి పోరాడుతోందని అర్థం. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. దీన్ని సులభంగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


– గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్‌ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.
– అల్లాన్ని పేస్ట్‌ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీ పొడి కలిపి టీ పెట్టుకొని తాగాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
– అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
– పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, ఆకులు తీసివేసి, ఆ నీళ్లు తాగాలి.

మెట్లు ఎక్కి దిగితే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

 ప్రతిరోజూ వాకింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అయితే సీజన్‌ మారినప్పుడు వ్యాయామాలు చేసేందుకు వాతావరణం అనుకూలించదు. అలాంటప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

– మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాల వల్ల శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాయామాలు శారీరక బలంతోపాటు శక్తినిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు.

– మెట్లపై చేతులు పెట్టి పైకి కిందకి లేస్తూ చేసే వ్యాయామాలు ఆరోగ్యాన్నిస్తాయి.

– రోజూ మెట్లు ఎక్కుతూ దిగుతూనే ఉంటాం. కానీ ఈ వ్యాయామం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టం. కానీ దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.

– మెట్లపై బాడీని ఏటవాలుగా వంచి ఒక కాలు పైకి లేపుతూ.. దించుతూ వ్యాయామం చేయాలి. 

Friday, September 13, 2024

 ఈ అలవాట్లు.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయ్..!

మీకు ఈ అలవాట్లు గనుక ఉంటే.. క్యాన్సర్‌ ప్రమాద శాతం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మన జీవన శైలిలో ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని బిఎంసి మెడిసన్‌ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం పేర్కొంది.


1. వ్యాయామం : ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ తప్పనిసరి. వారంలో కనీసం 5 నుండి 10 గంటలైనా వ్యాయామం చేయాలి.

2. తృణధాన్యాలు : రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్‌ వంటివి అధికంగా తీసుకోవాలి. రోజుకి కనీసం 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవాలి.

3. ఆరోగ్యకరమైన బరువు : వయసుకు తగ్గట్టుగా.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి.

4. మాంసం : వారానికి అరకేజి కంటే తక్కువగానే మాంసాన్ని తినాలి.

5. కూల్‌డ్రింక్స్‌ : కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

6. మద్యం సేవించకూడదు : మద్యం సేవించకూడదు. ఒకవేళ డ్రింక్‌ చేసినా.. వారానికి 14 గ్లాసుల కంటే తక్కువగా డ్రింక్‌ చేయాలి.

7. ఫాస్ట్‌ ఫుడ్స్‌ : రోజులో ఫాస్ట్‌ ఫుడ్స్‌, పిజ్జాలు, బర్గర్లు వంటివి పరిమితంగా తీసుకోవాలి.

 ఊబకాయంతో బాధ పడుతున్నారా..?

అధిక బరువు, ఊబకాయంతో పిల్లలతో సహా  పెద్దవారు కూడా బాధ పడుతున్నారు. శరీరంలో అధిక స్థాయిలో కొవ్వు పదార్థం నిల్వ ఉండే పరిస్థితి అధిక బరువుకు కారణం అవుతుంది. ఆరోగ్యకరమైన బరువు కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  

పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు ఆహార పదార్థాలు తీసుకోవాలి. శుద్ధి చేసిన ధాన్యాలు, స్వీట్లు, బంగాళదుంపలు, రెడ్‌ మీట్‌, ప్రాసెస్‌ చేసిన మాంసం, చక్కెర పానీయాలు వాడకూడదు. జంక్‌ ఫుడ్లకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన తెల్ల చక్కెర, మైదా, అధిక ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌, సంతృప్త కొవ్వుతో తయారు చేయబడిన అత్యంత ప్రాసెస్‌ చేయబడిన ఆహారాన్ని తినకూడదు.  

చిన్న ప్లేట్లలో ఆహారాన్ని తినడం వలన బరువు తగ్గవచ్చు. గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోడానికి పుట్టిన పిల్లలకు 24 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి. ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకే దగ్గర కూర్చొని టి.వి చూడడం తగ్గించాలి. సరైన వేళకు ఆహారం తీసుకొని, తగినంత నిద్ర పోయి ఒత్తిడి తగ్గించుకోవాలి. బాల్య స్థూలకాయం మీద దృష్టిపెట్టాలి. కారణం బాల్య స్థూలకాయం యుక్తవయస్సు వరకు కొనసాగే అవకాశం ఉంది.

దీని వల్ల వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లను మెరుగు పరచడం, శారీరక శ్రమను పెంచడం లాంటివి ఊబకాయం రాకుండా చేస్తాయి. ఊబకాయం, అధిక బరువులకు చికిత్స చేయడం కష్టం. కాబట్టి నివారణ చాలా ముఖ్యం.