Thursday, August 1, 2024

 ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టే.. !

ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. కాలేయం కొవ్వుతో నిండిపోవడం వల్ల కాలేయం పనితీరు దెబ్బతింటుంది. ఇది శరీర పనితీరు మీద ప్రభావం చూపిస్తుంది. ఇతర అనారోగ్య సమస్యలు రావడానికి కూడా కారణం అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో లక్షణాలు అంత తొందరగా కనుక్కోలేము. ఇవి చాలా సాధారణ ఆరోగ్య సమస్యల్లా అనిపిస్తుంటాయి. కానీ లివర్ టెస్ట్ కు వెళ్లినప్పుడు తప్ప అవన్నీ ఫ్యాటీ లివర్ కు సంబంధించినవే అని తెలుసుకోలేము. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో ఉండే లక్షణాలేంటి? తెలుసుకుంటే..

అలసట..
శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. పనుల మధ్య విశ్రాంతి తీసుకుంటూ ఉంటే అలసట తగ్గి తిరిగి పనులను చురుగ్గా చేసుకోగలుగుతాము. కానీ అసలు పని చేయకపోయినా, కొన్ని నిముషాలకే తీవ్రమైన అలసట వస్తున్నా, శరీరంలో శక్తి లేనట్టు అనిపిస్తున్నా అది ఫ్యాటీ లివర్ కు కారణం కావచ్చు.

పొట్ట అసౌకర్యం..
పొట్టకు కుడి భాగంలో అస్పష్టంగా నొప్పి లేదా అసౌకర్యం ఏర్పడుతుంటే దాన్ని కూడా ఫ్యాటీ లివర్ లక్షణంగా పరిగణిస్తారు.

వాపు..
ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారిలో ఒంట్లో నీరు చేరుతుంది. ముఖ్యంగా పొట్ట లేదా కాళ్ళలో నీరు చేరి వాపు వచ్చినట్టు కనిపిస్తుంది.

ఆకలి లేకపోవడం..
ఆకలి లేకపోవడం కూడా ఫ్యాటీ లివర్ సమస్య లక్షణం కావచ్చు. ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో తినాలనే కోరిక బాగా తగ్గిపోతుంది. అలాగే ఊహించని విధంగా బరువు తగ్గుతారు.

కామెర్లు..
ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారతాయి. కామెర్లతో ఇబ్బంది పడేవారు.. పదే పదే కామెర్ల సమస్య బారిన పడేవారు ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశం ఎక్కువ.

గందరగోళం..
ఏకాగ్రత లేకపోవడం, మానసికంగా గందరగోళానికి గురి కావడం ఫ్యాటీ లివర్ లో లక్షణాలు.

రక్తనాళాలు..
రక్తనాళాల స్థితిని బట్టి కూడా ఫ్యాటీ లివర్ ను అంచనా వేయవచ్చు. రక్తనాళాలు అన్నీ ఒకే చోట సాలీడులా కనిపిస్తూ ఉంటే అవి కూడా ఫ్యాటీ లివర్ ను సూచిస్తాయి.

 ఈ టెక్నిక్స్ ఫాలో అయితే చాలు.. ఈజీగా బరువు తగ్గచ్చు..!

వాకింగ్ చాలా సులువుగా అందరూ చేయగల వ్యాయామం. సాధారణంగా ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వాకింగ్ ను తమ లైఫ్ స్టైల్ లో భాగం చేసుకుంటారు. కొందరు మాత్రం బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. ఎంత నడిచినా సరైన ఫలితాలు లేవని నిరాశ పడుతుంటారు. అలాంటి వారు వాకింగ్ టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. వీటి వల్ల కేలరీలు బర్న్ కావడం, తద్వారా బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. బరువు తగ్గించే వాకింగ్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుంటే..

పవర్ వాకింగ్ పేరుకు తగ్గట్టుగానే పవర్పుల్ గా ఉంటుంది. కేలరీలను సులువుగా బర్న్ చేయడానికి ఇది ఉత్తమ టెక్నిక్. గుండె స్పందన రేటును పెంచుతూ చురుగ్గా నడవాలి. చేతులను బలంగా, వేగంగా ముందుకు వెనక్కు ఊపాలి. నడిచేటప్పుడు నిటారుగా ఉండాలి. ఈ వాకింగ్ వల్ల కేలరీలు బర్న్ కావడమే కాదు.. రక్తాన్ని పంప్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఇంటర్వెల్ వాకింగ్ అనేది వేగంగా నడవడానికి, నెమ్మదిగా నడవడానికి మధ్య బ్యాలెన్స్ చేస్తూ చేసే వాకింగ్. ఇందులో 1 నిమిషం వేగంగా నడుస్తారు. ఆ తరువాత 2 నిమిషాలు వేగాన్ని తగ్గిస్తారు. ఇలా 20-30 నిమిషాలు వాకంగ్ చేయడం వల్ల కేలరీలు బర్న్ కావడం చాలా సులువుగా ఉంటుంది. మొత్తం ఫిట్‌నెస్ ను మెరుగుపరుస్తుంది.

చదునైన నేలపైన నడవడం కంటే కాస్త ఎత్తుగా కొండ ప్రాంతంలా ఉన్న ప్రదేశంలో నడవడమే హిల్ వాకింగ్. ఈ వాకింగ్ కండరాలకు పని పెడుతుంది. బయట వాకింగ్ కు వెళ్లేవారు కొండ ప్రాంతంలా ఎత్తుగా ఉన్న ప్రదేశంలో నడవాలి. ఇక ఇంట్లో ట్రెడ్ మిల్ వాడేవారు ఇంక్లైన్ ఫీచర్ తో రూపొందిన ట్రెడ్ మిల్ ను ఉపయోగించాలి. ఈ వాకింగ్ కేలరీలను బర్న్ చేయడమే కాకుండా కాళ్లను టోన్ చేస్తుంది.

సాధారణంగా వాకింగ్ చేయడానికి, ఏదైనా బరువు పట్టుకుని నడవడానికి చాలా తేడా ఉంటుంది. బరువుగా ఉన్న దుస్తులు, లేదా తేలికపాటి వెయిట్స్ ను పట్టుకుని నడవడం వల్ల కేలరీలు బర్న్ కావడంలోనూ, కండరాలు బలంగా మారడంలోనూ సహాయపడుతుంది. అయితే చాలా ఎక్కువ బరువులను మాత్రం ఉపయోగించకూడదు.

శరీర బలాన్ని పెంపొందించడానికి వాకింగ్ లంగ్స్ సహాయపడతాయి. ఒక కాలుతో పెద్ద అంగ వేసి మోకాలును వంచాలి. వెనుక కాలు మోకాలును వంచి మోకాలును నేలకు తగలకుండా కాస్త గ్యాప్ ఉండేలా చూడాలి. ఈ సమయంలో రెండు చేతులను నడుము దగ్గర ఉంచి శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి. దీనివల్ల ఊపిరితిత్తులు బలపడతాయి. కాళ్లు బలంగా మారుతాయి.

 మెదడు బలహీనంగా ఉందని చెప్పే 5 లక్షణాలు ఇవీ..

మానవ శరీరంలో మెదడు ప్రధాన అవయవం. ఇది మనిషి శారీరక ఆరోగ్యంలోనూ, మానసిక ఆరోగ్యంలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉన్నవారు రోజువారీ తమ కార్యకలాపాలను చాలా చురుగ్గా చేస్తుంటారు. ఆలోచించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగ్గా ఉంటారు. అయితే మెదడు పనితీరు సరిగా లేకపోతే మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఇతర శారీరక, మానసిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. మెదడు బలహీనంగా ఉంటే 5 లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే..

చిరాకు..
చిరాకు అనేది మానసిక ఆరోగ్యం సరిగా లేదని తెలియజెప్పే సంకేతం. వ్యక్తుల సాధారణ ప్రవర్తనకు, మెదడు బలహీనంగా ఉన్నవారి ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. చిరాకు మానసిక ఒత్తిడిలో భాగం. ఈ చిరాకు అనే లక్షణం ఎక్కువ కాలం కొనసాగితే ఇది తీవ్రమైన వ్యాధులకు కూడా కారణమవుతుంది.

నిద్ర..
నిద్ర సరిగా లేకపోవడం కూడా మెదడు బలహీనంగా ఉండటాన్ని సూచిస్తుంది. నిద్ర పట్టకపోవడం, నిద్రలో పదే పదే మెలకువ రావడం, విపరీతమైన ఆలోచనలు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. ఇవన్నీ మెదడు బలహీనంగా ఉండటాన్ని సూచిస్తాయి.

ఒంటరితనం..
మెదడు బలహీనంగా ఉన్నవారు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడటానికి ఆసక్తి చూపించరు. దేని మీదా ఆసక్తి ఉండదు. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికి ఎమోషన్ అవుతూ ఉంటారు. ఇదంతా మెదడు బలహీనంగా ఉండటం వల్లే జరుగుతుంది.

బరువు..
వేగంగా బరువు తగ్గడం లేదా వేగంగా బరువు పెరగడం మెదడు పనితీరు సరిగా లేకపోవడం వల్ల జరుగుతుంది. మెదడు బలహీనంగా ఉండటం వల్ల ఆకలి హార్మోన్లలోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల అధికంగా ఆకలి వేయడం, లేదా ఆకలి లేకపోవడం జరుగుతుంది.

మతిమరుపు..
ఏ విషయం మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకు మరచిపోవడం వంటివి జరుగుతూ ఉంటే మెదడు బలహీనంగా ఉన్నట్టే.

 ఫ్రిజ్‌లో నిల్వ చేసిన ఫ్రోజన్ ఫుడ్స్ తింటారా..?

నేటి బిజీబిజీ లైఫ్‌లో ఇంట్లో ఆహారం వండుకుని తినేంతటి టైం లేదన్నది వాస్తవమే. దీంతో, యువత మార్కెట్లో ఫ్రిజ్‌లల్లో శీతలీకరించిన ప్యాకేజ్డ్ ఫుడ్స్‌ను కొనుక్కుని తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆరోగ్యానికి  చేటు తెస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆహార నిపుణుల చెప్పే దాని ప్రకారం, ఫ్రిజ్‌లల్లో నిల్వచేసిన ఇలాంటి ఫుడ్స్‌లో రకరకాల ప్రిజర్వేటివ్‌లు జత చేస్తారు. అంతేకాదు, వీటిల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికారక కొవ్వులు, స్టార్చ్ పెద్దమొత్తంలో ఉంటాయి. ఆహారం ఎక్కువ రోజులపాటు నిల్వ ఉండేందుకు కారణమైయ్యే వీటితో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి

ఇలాంటి ఫుడ్స్‌లోని స్టార్చ్ కారణంగా అరుగుదల సమస్యలతో పాటు డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

ఈ ఫుడ్స్‌తో హృద్రోగాల అవకాశాలు కూడా పెరుగుతాయట. వీటిల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్‌యే ఇందుకు కారణం. ఈ కొవ్వు పదార్థాల వల్ల ఒంట్లో చెడు కొలెస్టెరాల్ పెరిగి మంచి కొలెస్టెరాల్ స్థాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా గుండె జబ్బుల బారిన పడే అవకాశం పెరుగుతుంది. వీటిల్లో అధికంగా ఉండే సోడియంతో బీపీ పెరుగుతుంది.

ఈ తరహా ఆహారాలతో ఊబకాయం బారిన పడే అవకాశాలు గణనీయంగా ఉంటాయి. నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఒక కప్పు ఫ్రోజన్ చికెన్ తింటే 600 కెలొరీలు శరీరంలో చేరతాయి.

ఫ్రిజ్‌లో నిల్వ చేసే ఫ్రోజన్ ఫుడ్స్ కారణంగా క్యాన్సర్ రిస్క్‌ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకానొక అధ్యయనం ప్రకారం ఈ రిస్క్ 65 శాతం ఉంటుందట.

 నేరేడు పండ్లు ఇలా తింటే జబ్బులు పరార్..!

నేరేడు పండ్లు వర్షాకాలంలో కాస్తాయి. ఇవి మార్కెట్ లో కూడా విరివిగా అందుబాటులో ఉంటాయి. కొందరు నేరేడు పండ్లను జామ్ లు, స్వీట్లు, సలాడ్ లు, జ్యూసుల రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఇలా కాకుండా సహజంగా కాస్త పచ్చిగానే తినాలి. అలా తింటే 10 వ్యాధులు మంత్రించినట్టు మాయమవుతాయి.
రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించడంలో సహాయపడే జంబోలిన్, జంబోసిన్ అనే సమ్మేళనాలు నేరేడులో ఉంటాయి. మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచే ఎంజైమ్ లు నేరేడులో ఉంటాయి. మలబద్దకం, అపానవాయువు, గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది.
నేరేడులో విటమిన్-సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.
పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నేరేడు పండ్లను నేరుగా తింటే రక్తపోటు, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి.
చర్మం ఆరోగ్యంగా ఉండటంలోనూ మొటిమలు, చర్మ సంబంధిత సమస్యలు తగ్గించడంలోనూ నేరేడు పండ్లు సహాయపడతాయి.
నేరేడు పండ్లను సీజన్ మొత్తం తీసుకుంటూ ఉంటే రక్తం శుద్ది అవుతుంది. రక్తంలో పేరుకున్న టాక్సిన్లను తొలగించడంలో ఇది సహాయపడుతుంది.
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న కారణంగా నేరేడు పండ్లు తింటే బరువు నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
నేరేడు చెట్టు ఆకులను దంతాలు, చిగుళ్లుకు సంబంధించిన సమస్యలను చికిత్స చేయడంలో ఉపయోగిస్తారు. చిగుళ్ల వాపు, పంటి నొప్పి, బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్, నోటి దుర్వాసన వంటి సమస్యలు తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
కాలేయ సమస్యలతో ఇబ్బంది పడేవారికి నేరేడు పండ్లు ఔషధంలా పనిచేస్తాయి. కాలేయాన్ని శుద్ది చేయడంలోనూ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది.

 పొట్టకు సంబంధించి అన్ని సమస్యలకు ఒకటే మందు..!

తీసుకునే ఆహారం విషయంలో ఏమాత్రం తేడా జరిగినా అది కడుపు మీద ప్రభావం చూపిస్తుంది. సాధారణంగా వేళకాని వేళలో తినడం, అతిగా తినడం, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం, రాంగ్ కాంబినేషన్ ఫుడ్ తీసుకోవడం, అనారోగ్యకరమైన పానీయాలు తాగడం వంటివి కడుపుకు సంబంధించిన సమస్యలను పెంచుతాయి. అజీర్తి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం,గ్యాస్, చెడు వాసనతో కూడిన అపానవాయువు, మలబద్దకం వంటివన్నీ ఈ లిస్ట్ లో ఉంటాయి. అయితే కడుపుకు సంబంధించిన ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టడానికి ఆయుర్వేదం సూచించిన ఒకే ఒక్క పొడిని రోజూ తీసుకుంటే సరిపోతుంది. అదేంటో తెలుసుకుంటే..

ఆయుర్వేదంలో త్రిఫలకు చాలా ప్రాధాన్యత ఉంది. త్రిఫల చూర్ణం అనేది ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ.. మూడింటి మిశ్రమం. ఇది జీర్ణసమస్యలను మంత్రించినట్టు నయం చేస్తుంది.

త్రిఫలను ఎలా వాడాలి..?
రాత్రి సమయంలో ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ త్రిఫల చూర్ణం వేసి దాని మీద మూత పెట్టాలి. దీన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. ఉదయాన్నే దీన్ని వడగట్టి అందులో నిమ్మరసం కాస్త కలుపుకుని తాగాలి. కావాలి అనుకుంటే అందులో రెండు స్పూన్ల తేనె కూడా కలుపుకోవచ్చు. ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల పానీయాన్ని తాగుతుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. బరువు తగ్గడంలోనూ, ఆకలిని పెంచడంలోనూ సహాయపడుతుంది.

త్రిఫల ప్రయోజనాలు..
త్రిఫల చూర్ణం పైన చెప్పుకున్న విధంగా తీసుకుంటే కేవలం జీర్ణ సమస్యలు, మలబద్దకమే కాదు.. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరతాయి.
త్రిఫల చూర్ణంలో గుండెకు మేలు చేసే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రోజూ త్రిఫల పానీయం తీసుకుంటే గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడేవారు త్రిఫల చూర్ణాన్ని నీటిలో కాకుండా పాలలో కలిపి తాగాలి. ఇది చాలా తొందరగా ఉపశమనం ఉంటుంది. ఇదే కాకుండా త్రిఫల చూర్ణాన్ని వేడినీటిలో కలుపుకుని తాగినా తగిన ఫలితం ఉంటుంది.

 రాత్రంతా ఏసీ గదిలోనే నిద్రిస్తున్నారా..?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు మానవాళి పాలిట ఓ మహమ్మారిగా మారుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెర్రస్ హెచ్చరించారు. ఇక గత కొద్ది రోజులుగా ప్రపంచంలో పలుచోట్ల రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని యూరోపియన్ కాపర్నికస్ నెట్వర్క్ హెచ్చరించింది. పలు ప్రాంతాల్లో ఇవి 50 డిగ్రీల సెల్సియస్ దాటాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రజలు ఏసీల వైపు మళ్లుతున్నారు కొందరు గంటలకు గంటలు ఏసీ గదుల్లోనే గడిపేస్తున్నారు. ఏసీలు ఆన్‌లో ఉంచే నిద్రిస్తున్నారు. అయితే, ఇలాంటి పనులతో సమస్యల పాలవ్వాలని వైద్యులు  హెచ్చరిస్తున్నారు.

ఏసీ గదుల్లోని గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. ఫలితంగా కళ్లు పొడిబారతాయి. చివరకు దురదలు, ఇతర ఇబ్బందులు తలెత్తుతాయి. చల్లని గదుల్లో ఉంటే జీవక్రియలు నెమ్మదిస్తాయి. దీంతో, మత్తుగా, నిద్ర, లేదా అలసట ఆవరించినట్టు అనిపిస్తుంది. ఏసీ గదుల్లో ఎక్కువ సేపు ఉంటే శరీరం తేమ అధికంగా కోల్పోయి డీహైడ్రేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. గాల్లో తేమలేకపోవడంతో చర్మ సంబంధిత సమస్యలూ వస్తాయి. దురదలు, పొలుసులు ఊడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏసీ ఆన్ చేసినప్పుడు ఒక్కసారిగా ఉష్ణోగ్రత, గాల్లో తేమ తగ్గిపోయి తలనొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. ఏసీ గదుల్లో తేమలేని, చల్లని గాలి కారణంగా ఆస్తమా, ఎలర్జీ లాంటి సమస్యలు ఎక్కువవుతాయి. ఇక ఏసీ ధ్వని కారణంగా రాత్రుళ్లు నిద్ర చెడిపోయే అవకాశం కూడా ఉంది.
ఏసీ నిర్వహణ సరిగా లేని సందర్భాల్లో దుమ్ము, పోలెన్, బూజు వంటి వాటితో రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఏసీ కారణంగా గదిలో దుమ్మూధూళి వంటివి పోగుబడి సమస్యలకు దారి తీయొచ్చు.

ఏసీ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నవజాత శిశువులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కనీసం 20 నిమిషాల ముందే ఏసీ ఆన్ చేసి గదంతా సమతుల వాతావరణం ఏర్పడ్డాకే చిన్నారులను గదిలోకి తీసుకెళ్లాలని నిపుణులు చెబుతున్నారు. ఏసీ నుంచి చల్లటి గాలి నేరుగా పిల్లలకు తగలకుండా జాగ్రత్త పడాలి. ఏసీ ఉష్ణోగ్రత 25 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండాలి.


 ఈ ఆహారాలతో జాగ్రత్త.. బీపీని అమాంతం పెంచేస్తాయ్..!

రక్తపోటు లేదా బ్లడ్ ప్రెషర్ ను షార్ట్ కట్ లో బీపీ అని పిలుస్తుంటారు. ఒకప్పుడు బీపీ అనేది వయసు పెరిగిన వారిలో వచ్చే సమస్య. కానీ నేటికాలంలో పెద్ద చిన్న తేడా లేకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ వయసు పిల్లలలో కూడా అధిక రక్తపోటు సమస్య బయట పడటం ఆందోళనకు గురిచేస్తున్న అంశం. బీపీ ని చాలా వరకు తీసుకునే ఆహారం ద్వారా నియంత్రణలో పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు, ఆహార నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అధిక బీపీ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలు తినకపోవడం మంచిదని చెబుతుంటారు. ఊరగాయలు , పచ్చళ్లు తింటే బీపీ పెరుగుతుందని చెప్పడం వినే ఉంటారు. కానీ వాటి కంటే ఎక్కువగా బీపీని ప్రభావితం చేసే ఆహారాలు అందరూ తింటున్నారు. అవేంటో తెలుసుకొని వాటిని దూరంగా ఉంచడం చాలా అవసరం.
 
ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఈ కాలంలో చిన్న, పెద్ద అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వీటిని కెచప్ తో తినడం మరింత ఇష్టపడతారు. వీటిని నూనెలో ఎక్కువసేపు వేయించడం వల్ల అందులో కొవ్వులు, ఉప్పు పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది.

జంక్ ఫుడ్ ను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఇవి చాలా రుచిగా ఉండటం వల్ల రుచుల కోసం ఆరాటపడేవారు ముందు వెనుక ఆలోచించకుండా వీటిని తినేస్తుంటారు. వీటిలో సోడియం, కొవ్వులు, కేలరీలు ఎక్కువ. ఇవి బీపీని పెంచుతాయి.
 
ఫారనర్లు ఎక్కువగా తినే ఆహారాలలో సోడియం, నైట్రేట్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా చికెన్ తో తయారు చేసే హాట్ డాగ్ లో ఇవి అధికం. ఇది బీపీ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. గొప్పలకు, రుచికి పోయి వీటిని తింటే హై బీపీ ముప్పు తప్పదు.

మార్కెట్లో లభ్యమయ్యే స్వీట్లు, క్యాండీలలో అధిక చక్కెర వినియోగిస్తారు. చక్కెర ఎక్కువ తీసుకోవడం కూడా బీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. వీటిని తీసుకునేవారు అధిక బీపిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వీటికి దూరంగా ఉండటం మంచిది.

ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే బంగాళదుంపతో తయారుచేసిన చిప్స్ లో అధిక మొత్తంలో కొవ్వులు ఉంటాయి. ఉప్పు కూడా అధికంగా ఉంటుంది. ఇది బీపీ ప్రమాదాన్ని పెంచుతుంది.

 విజృంభిస్తున్న చండీపురా వైరస్.. చికిత్స ఏంటి..?


దేశవ్యాప్తంగా చండీపురా వైరస్  విజృంభిస్తోంది. ఇటీవలే గుజరాత్‌లో పదుల సంఖ్యలో వైరస్ కేసులు బయట పడగా.. తాజాగా నాలుగేళ్ల బాలిక మృతి చెందినట్లు పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ  ధ్రువీకరించింది. బాలికతో నేరుగా కాంటాక్ట్ అయిన15 మందిని అధికారులు క్వారంటైన్‌లో ఉంచారు.

ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12 జిల్లాల్లో 29 కేసులు నమోదయ్యాయి. ఇందులో గుజరాత్‌లో 26, రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్‌లో ఒకటి చొప్పున ఉన్నాయి. చండీపురా వైరస్ తొలిసారిగా మహారాష్ట్రలోని చండీపురా గ్రామంలో కనుగొన్నారు. ఈ వైరస్ గుజరాత్‌తో సహా దేశంలోని వివిధ రాష్ట్రాలను ప్రభావితం చేసింది. ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా పిల్లల్లో ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  హెచ్చరించింది.

మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని చండీపురా గ్రామంలో 1966లో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోతున్నారు. వైరస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని వైద్యులు వెల్లడించారు. అలా దీనికి చండీపురా వైరస్ అని పేరు పెట్టారు. ఆ తరువాత 2004, 2006, 2019లలో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.

ఆ సమయంలో 56-75 శాతం మరణాలు సంభవించాయి. చండీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ ఫ్లై ద్వారా వ్యాపిస్తుంది. ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణం. 2024 జూన్ ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వైరస్ కేసులు నమోదయ్యాయి.

చండీపురా వైరస్ కారణంగా రోగికి ప్రాథమికంగా జ్వరం, విరేచనాలు వస్తాయి. ఫ్లూ లక్షణాలతోపాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధిని కలిగి ఉంటారు. ఈ వైరస్ దోమలు, ఈగలు, కీటకాల ద్వారా వ్యాపిస్తుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు/టాక్సిన్‌లు మొదలైన వాటి వల్ల చండీపురా వ్యాధి ఏర్పడుతుంది. వర్షాకాలంలో ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది.

ప్రస్తుతం చండీపురా వైరస్‌కు యాంటీవైరల్ చికిత్స లేదా వ్యాక్సిన్ లేదు. రోగాన్ని సకాలంలో గుర్తించి అత్యవసర చికిత్స అందించాలి. వ్యాధి తీవ్రమైన వారికి ఆక్సిజన్ థెరపీ, వెంటిలేషన్ ద్వారా చికిత్స అందిస్తారు.

 దగ్గు, జలుబుతో బాధపడుతున్నారా..?

ప్రతీ సీజన్‌లో ఏవో ఒక అనారోగ్య సమస్యలు ప్రజలను వేధిస్తూనే ఉంటాయి. అయితే, వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఈ సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పులు, వర్షాలు, వరదలు, బురద పేరుకుపోవడం, దోమలు వృద్ధి చెందడం వంటివి అనారోగ్యానికి కారణమవుతాయి. చిన్న పిల్లలైనా.. పెద్దవారైనా వర్షాకాలంలో జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతుంటాయి. మెడిసిన్స్ వాడితే ఈ సమస్యలు తగ్గిపోతాయి. కానీ, పదే పదే మెడిసిన్స్ వాడటం కూడా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. వర్షాకాలంలో మీరు కూడా జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో సతమతం అవుతున్నారా? ఇందుకోసం ఏళ్లుగా వంటింట్లో ఉపయోగించే కొన్ని వస్తువులతోనే చికిత్స పొందవచ్చు.  

వర్షాకాలంలో గొంతునొప్పి, జలుబు, దగ్గు సమస్య వేధిస్తోందా? అయితే, తులసి ఆకులు, లవంగాలు, దాల్చిన చెక్కలను నీటిలో వేసి ఆవిరి పట్టాలి. ఇది చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. ఇలా ఆవిరి పట్టడం వల్ల కఫం కరిగిపోతుంది. తులసి, దాల్చినచెక్క, లవంగాలు బ్యాక్టీరియా వ్యాప్తిని నివారిస్తాయి. ఆవిరి పట్టడం వల్ల ముక్కు, గొంతు వాపు తగ్గుతుంది.

వర్షాకాలంలో జలుబు, దగ్గు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు ఉన్నట్లయితే.. లవంగం, అల్లం, తులసి ఆకుల కషాయాన్ని తాగడం మంచిది. దానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇది జలుబు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

జలుబు రెండు మూడు రోజుల్లో నయమవుతుంది. కానీ దగ్గు ప్రారంభమైతే అది కనీసం ఒక వారం పాటు ఉంటుంది. ఈ దగ్గు నుంచి ఉపశమనం పొందడానికి.. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవడం మంచిది. పాలలో కూడా పసుపు మరిగించి తాగొచ్చు. దీని ద్వారా దగ్గు, జలుబు తగ్గుతాయి.

కడుపులో గ్యాస్ సమస్యా.. ?

సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి డయాబెటీస్, బీపీ, హార్ట్‌ఎటాక్‌. అయితే వీటితోపాటు మరో సమస్య సైతం ప్రజల్ని వేధిస్తోంది. అది ఏంటంటే అసిడిటీ. దీన్నే కడుపులో మంట, గ్యాస్ పట్టేయడం అంటారు. మారిన అలవాట్లు, ఆహార పదార్థాల వల్ల ఇది వస్తోంది. నూనెతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం, ముఖ్యంగా రోడ్డు పక్కన అమ్మే పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య వస్తోంది.

అలాగే రుచికరంగా ఉండేందుకు వివిధ రకాల మసాలాలు ఆహారానికి పట్టించి తినడం, వేయించిన పదార్థాలు అతిగా తినడం వల్ల గ్యాస్ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కంటికి కనిపించదు కానీ రోగిని మాత్రం నానా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీంతో రోజువారీ కార్యకలాపాలకు తీవ్రఇబ్బందులు సైతం ఎదురవుతాయి. అయితే కడుపులో గ్యాస్ పట్టినా లేదా మంటగా అనిపించినప్పుడు మనం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బాధ నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

కడుపులో గ్యాస్ సమస్య పోయేందుకు ఎక్కువగా కీర దోసకాయ తినాలి. దీనిలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల శరీరానికి మంచి ఆహారం, నీరు దొరకడంతోపాటు, గ్యాస్ట్రిక్ సమస్యలు దూరంగా ఉంటాయి. భోజనానికి ముందు కీరదోస సలాడ్‌గా తింటే మరీ మంచిది. అలాగే అరటిపండు తినడం వల్ల కడుపులో మంట, గ్యాస్ సమస్యకు దూరంగా ఉండవచ్చు. మిగతా పండ్లలాగా ఇది పెద్ద ఖరీదు కూడా కాదు. దీనిలో ఐరన్, కాల్షియం, పీచు పదార్థం పుష్కలంగా ఉండడంతో అసిడిటీ, అజీర్ణం సమస్యలు దూరం అవుతాయి.

రెగ్యులర్‌గా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. కొబ్బరినీళ్లు అనేవి ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. అందులోనూ ఇవి చాలా సహజమైనది కాబట్టి గ్యాస్ సమస్యతోపాటు అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి చేకూరుతాయి. అలాగే నిమ్మకాయ నీరు తాగడం ద్వారా కూడా గ్యాస్ నుంచి ఉపశమనం పొందవచ్చు. నిమ్మరసం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడి గ్యాస్ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.