Tuesday, September 17, 2024

 మొబైల్‌ ఫోన్లను పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా..? 


నేటికాలంలో రోజూ నిద్రపోయే ముందు ఫోన్‌ చూసి పడుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఫోన్‌ని పక్కనే పడుకుని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని పలు పరిశోధనలు వెల్లడించాయి. మొబైల్‌ ఫోన్ల వల్ల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అదెలాగో తెలుసుకుందామా..?!

మొబైల్‌ ఫోన్ల నుంచి వచ్చే లైటింగ్‌ మెదడును ఉత్తేజపరుస్తుంది. మొబైల్‌ ఫోన్లు పక్కనే ఉంటే నిద్రపట్టడం కష్టమవుతుంది. మొబైల్‌ ఫోన్‌ల నుంచి వచ్చే కాంతి మెదడులోని మెలటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఈ హార్మోన్‌ నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.

మొబైల్‌ ఫోన్‌ నుంచి వెలువడే కాంతిలో రేడియేషన్‌ ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు దారితీసే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా తెలిపాయి. అలాగే మొబైల్‌ ఫోన్‌ లైటింగ్‌తో తలనొప్పి వచ్చే అవకాశాలెక్కువ ఉన్నాయి. ఈ కాంతి కంటి సమస్యలకు కూడా కారణమవుతోంది.

రాత్రి వేళల్లో మొబైల్‌ ఫోన్‌ మీ పక్కన లేకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు :

– మొబైల్‌ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పడకగదిలోకి తీసుకురావద్దు.

– నిద్రపోయే ముందు మొబైల్‌ ఫోన్‌ను ఫ్లయిట్‌ మోడ్‌లోకి సెట్‌ చేసుకోండి.

– నిద్రపోయే ముందు మొబైల్‌ ఫోన్‌ రింగ్‌టోన్‌ లేదా నోటిఫికేషన్‌ టోన్‌లను బంద్‌ చేయండి.

– మీరు పడుకునే ప్రాంతంలో మొబైల్‌ ఫోన్‌ను ఛార్జింగ్‌ పెట్టొద్దు. మీకు దూరంగా ఎక్కడైనా ఛార్జింగ్‌ పెట్టండి. ఫోన్‌కి రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టి అలానే వదిలేస్తే మొబైల్‌ బ్యాటరీ సామర్థ్యం తగ్గే అవకాశం ఉంది.

 వీటిని తింటే సంతోషం మీ సొంతం..!

నేటి కాలంలో ఐటి రంగంలో పనిచేసే ఉద్యోగులే కాదు.. మిగతా ఇతర రంగాల్లో పనిచేసే ఉద్యోగులు కూడా విపరీతమైన పని ఒత్తిడితో నలిగిపోతున్నారు. పని ఒత్తిడి వల్ల సరైన సమయానికి కూడా తినలేకపోవడం వల్ల వారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి ఒత్తిడికి చెక్‌ పెట్టాలంటే ఏం చేయాలి? రోజూ వ్యాయామాలు చేసినా ఒత్తిడి తగ్గకపోతే.. మీ ఆహారంలో వీటిని భాగం చేసుకుంటే సంతోషం మీ సొంతం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా..!

సాల్మన్‌ ఫిష్‌ : సాల్మన్‌, ట్యూనా వంటి ఫిష్‌లలో ఒమేగా – 3 ఫ్యాటీ యాసిడ్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇన్‌ప్లమేషన్‌ను తగ్గించి, సంతోషాన్ని పెంచుతాయి.

ద్రాక్ష : నీటిశాతం ఎక్కువగా ఉండే ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయి. ద్రాక్ష పండ్లను తినడం వల్ల మీరు ఒత్తిడికి గురికాకుండా ఉంటారు.

అవకాడో : అవకాడోలో విటమిన్‌ బి6, ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తికి ఎంతగానో సహాయపడతాయి.

బచ్చలికూర : బచ్చలికూరలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉల్లాసంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పెరుగు : పులియబెట్టిన ఆహారాలు తినడంతో ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇడ్లీ, దోస, పెరుగు తినడంతో ఒత్తిడి తగ్గుతుంది. ఆనందం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే డ్రైఫ్రూట్స్‌ తినకూడదు.. ఎందుకంటే?


డ్రైఫ్రూట్స్‌ రుచిగా ఉండడమేకాదు… త్వరగా శక్తినిస్తాయి. అందుకే చాలామంది తమ ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్‌ తీసుకుంటారు. అయితే ఐదు రకాల డ్రైఫ్రూట్స్‌ మాత్రం మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం డ్రైఫ్రూట్స్‌ తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అత్తిపండ్లు

అత్తిపండ్లలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉన్న ఈ అత్తిపండ్లలో నేచురల్‌ షుగర్స్‌ ఎక్కువగా ఉంటాయి. దీంతో అవి తీపిగా ఉంటాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే అసౌకర్యంగా ఉంటుంది. ఉబ్బరంగా అనిపిస్తుంది. వీటిని ఉదయంపూట తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యానికి మంచిది.


ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో సహజంగానే షుగర్స్‌ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ ముందు ఖాళీ కడుపుతో వీటిని తిన్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదముంది. అందుకే ఉదయాన్నే వీటిని తీసుకోకుండా ఉంటేనే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వీటిని తినాలనుకుంటే.. రోజులో ఏదో ఒక టైమ్‌లో తీసుకోవచ్చు. వీటిని నేరుగా కాకుండా.. పెరుగుతో కలిపి తీసుకుంటే మంచిది.

ఆప్రికాట్స్‌

ఎండిన ఆప్రికాట్స్‌లో విటమిన్స్‌, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా వీటిల్లోనూ నేచురల్‌ షుగర్స్‌ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఉదయాన్నే కాకుండా.. ఈవినింగ్‌ స్నాక్స్‌లా తీసుకోవచ్చు. వీటిని చిరుధాన్యాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.


ప్రూనె

ఈ పండ్లలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఉండే నేచురల్‌ షుగర్స్‌ వల్ల ఇవి తియ్యగానే ఉంటాయి. వీటిని తింటే.. షుగర్‌ స్థాయిలు పెరుగుతాయి. ప్రూనె పండ్లను కూడా మధుమేహవ్యాధిగ్రస్తులు తీసుకోకుండా ఉంటే ఆరోగ్యానికి మంచిది.


కర్జూరం

కర్జూరంలో చక్కెర ఎక్కువగా ఉండడం వల్ల రుచిగానూ ఉంటాయి. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ కంటే ముందే తీసుకుంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. వీటిని తీసుకుంటే త్వరగా శక్తినిస్తాయి. కానీ ఊహించని విధంగా షుగర్‌ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయాన్నే కర్జూరం తీసుకోకుండా ఉంటేనే మంచిది.

  మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా?


మీరు రోజూ తగినంత నిద్రపోవడం లేదా? అయితే అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు రోజూ పోషకాహారం తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి వస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే కచ్చితంగా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.

– నిద్ర సరిగ్గా లేకపోతే మధుమేహం, ఊబకాయ సమస్యలకు గురవుతారని వైద్యులు చెబుతున్నారు.

– తగినంత నిద్ర లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.

– నిద్ర లేకపోవడం వల్ల.. అధికంగా తింటారు. అందుకే ఊబకాయానికి గురయ్యే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే మీరు తగినంత ఆహారం తీసుకోవడంతోపాటు, కంటినిండా నిద్రపోతే అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం తప్పుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

 వేసవి తాపాన్ని తగ్గించే చియా సీడ్స్‌!


 నలుపు, తెలుపు రంగుల్లో మార్కెట్లో లభించే చియా సీడ్స్‌ వల్ల అధిక బరువు తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అధిక బరువుతో బాధపడేవారు చియా సీడ్స్‌ని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గుతారని పలు పరిశోధనలు వెల్లడించాయి.

– చియా సీడ్స్‌ని నేరుగా తీసుకోకూడదు. వాటిని నీటిలో నానబెట్టాలి. అలా నానబెట్టిన వాటిని పెరుగులోనూ, సలాడ్స్‌లోనూ వేసుకుని తీసుకోవచ్చు.

– నానబెట్టిన వాటిని ఒక గ్లాసు నీటిలో వేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేదా పంచదార, గ్యాస్‌ వాటర్‌ని పోసుకుని తీసుకోవచ్చు.

– చియా సీడ్స్‌ వల్ల బరువు మాత్రమే కాదు. వేసవి తాపం నుంచి కూడా ఉపశమనం పొందచ్చు.

– చియా సీడ్స్‌లో ప్రొటీన్లు, ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. వీటిల్లో ఫైబర్‌ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి జీర్ణక్రియకు ఎంతో దోహదపడతాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతో సహాయపడతాయి.

 నిద్రపోయే ముందు లెమన్‌ వాటర్‌ తాగితే బరువు తగ్గుతారా..?

అధిక బరువు ఉన్నవారు.. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది ఆహారం మానేస్తారు. మరికొంతమంది ఫ్రూట్స్‌, పానీయాల్ని తీసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. నిద్రపోయేముందు లెమన్‌ వాటర్‌ తాగితే సులువుగా బరువు తగ్గుతారు అని తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది.

ఒక గ్లాసు వేడి నీటిలో లెమన్‌ జ్యూస్‌, కొద్దిగా అల్లం రసం, రెండు మూడు లవంగాలు వేసుకుని నిద్రపోయే ముందు తాగితే బరువు తగ్గుతారు అని సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ అవుతుంది. అయితే ఈ నీటిని రోజూ తాగితే బరువు తగ్గుతారు అని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం, అల్లం రసం, లవంగాలు వంటి పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటితో చేసిన నీటిని తీసుకుంటే అధిక బరువు కాకపోయినా.. తక్కువ బరువు తగ్గవచ్చు. ఈ నీరు అందరికి సరిపడుతుందని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఈ నీటిని తీసుకుంటే కొందరికి వికారము, వాంతులు కూడా అవ్వొచ్చు. మీరు ఈ నీటిని ఒకసారి తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఈ నీటిని తీసుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవిలో ఉప్పు నీటిని తాగితే ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

వేసవిలో విపరీతమైన ఎండల వల్ల చెమటలు పట్టడం డీహైడ్రేషన్‌కి గురవ్వడం జరుగుతుంటుంది. రోజుకి ఎన్ని నీటిని తాగినా సరే నోరు ఎండిపోతుంది. చల్లని నీరు లేదా, కొబ్బరి నీళ్లు ఇలా రకరకాలుగా పానీయాలు తీసుకున్నా సరే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కాలంలో నీటిలో చిటికెడు ఉప్పు కలుపుకుని తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు.

– వేసవిలో విపరీతంగా చెమట పడుతుంది. దీంతో చెమట రూపంలో సోడియం మాత్రమే కాకుండా ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లను కూడా కోల్పోతాము. అందుకే నీటిలో ఉప్పును కలిపి తాగితే తిరిగి శరీరానికి సోడియం అందుతుంది. తద్వారా డీహైడ్రేషన్‌ నుంచి కూడా తప్పించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

– ఉప్పు నీటిని అందరూ తీసుకోకూడదు. రక్తపోటు అధికంగా ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా ఉప్పునీటిని తీసుకోబోయే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.

– మూత్రపిండాల పనితీరు సాధారణంగా ఉన్న వ్యక్తులు కూడా ఉప్పునీటిని తీసుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు...

సూర్యోదయానికి కంటే ముందే నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది రాత్రి లేటుగా నిద్రపోవడం, ఉదయం లేటుగానే నిద్రలేవడం జరుగుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు. సమయానికి తినడం, నిద్రపోవడం వంటి క్రమశిక్షణతో కూడిన జీవితానికి చాలామంది ఇప్పుడు దూరమవుతున్నారనడంలో ఆశ్చర్యం లేదు. సూర్యోదయానికి ముందు ఒక గంట నిద్ర లేవడం వల్ల ఆరోజు చేయాల్సిన పనులను త్వరగా చేసుకోవడంతోపాటు, ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి అవేంటో తెలుసుకుందామా..

సూర్యోదయానికి ఒక గంట ముందు నిద్రలేచి.. కళ్లు మూసుకుని, కాసేపు నిటారుగా కూర్చుంటే.. ప్రేగు కదలికలు జరిగి శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి అని వైద్యులు చెబుతున్నారు.

– శరీరంలో వ్యర్థాలు తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

– బ్యాక్టీరియా కానీ, ఆల్కహాల్‌, అరుగుదల కోసం వేసుకునే మందులు, మృతకణాలు కానీ ఇలా ఏవైనా.. శరీరం నుంచి తొలగిపోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

– ప్రతిరోజూ ఉదయాన్నే ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.


 చక్కని ఆరోగ్యానికి చల్లని పానీయాలు


ప్రకృతి పానీయాల గురించి తెలుసుకుని తాగితే వేసవిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాంటి కొన్ని ప్రకృతి సిద్ధమైన పానీయాల గురించి తెలుసుకుందాం.


నిమ్మాపుదీనా జ్యూస్‌ :

సోడాలంటే చాలామందికి ఇష్టం. కానీ బయట దొరికే సోడాలన్నీ ఆరోగ్యానికి మంచివి కావు. అవి ఇష్టపడేవారు నిమ్మా పుదీనా జ్యూస్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తీసుకుంటే మంచిది. ఒక గ్లాస్‌ నిమ్మాపుదీనా జ్యూస్‌ తీసుకుంటే 76 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. వాటిలోని 40 గ్రా.సోడియం, 20.1 గ్రా. కార్బోహైడ్రేట్స్‌ శరీరానికి మేలు చేస్తాయి.


ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ : 

ఎలక్ట్రోలైట్‌ అధికంగా ఉండే 100 శాతం సహజసిద్ధమైన జ్యూసులు డీ హైడ్రేషన్‌ నుంచి ఉపశమనాన్ని కల్గిస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ ఒకటి. ఎండలో బాగా కష్టపడే వారికి, ఎక్కువగా అలసటకు గురయ్యే వారికి ఇది మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఒక గ్లాసు ఆరెంజ్‌ స్పోర్ట్స్‌ డ్రింక్‌ తాగితే 61 కేలరీల శక్తి అందుతుంది. 162 మిల్లీ గ్రాముల సోడియం, 15.3 కార్బొహైడ్రేట్స్‌ మీ శరీరానికి అందుతాయి. ఇది జీరో కొలస్ట్రాల్‌ డ్రింక్‌.

దానిమ్మ రసం :

ఇంట్లో రెండే రెండు నిముషాల్లో తయారుచేసుకోగల ఈ దానిమ్మ రసం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్‌తో 75 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఈ రసంలో 18.5 గ్రాముల కార్బొహైడ్రేట్స్‌, జీరో కొలెస్ట్రాలు ఉంటాయి.
వాటర్‌ మెలన్‌ చిల్లర్‌ : వేసవిలో ఎక్కువ మంది ఇష్టంగా తినేది పుచ్చకాయ. దీంతో, జ్యూస్‌ను చాలా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ, దానిమ్మ, నిమ్మ కాంబినేషన్‌లో తయారుచేసిన ‘వాటర్‌ మిలన్‌ చిల్లర్‌’ జ్యూస్‌ నోటికి రుచిగా ఉంటుంది. శరీరానికి 87 కేలరీల శక్తిని అందజేస్తుంది. కొలెస్ట్రాలు ఉండవు. గ్లాసు వాటర్‌మిలన్‌ చిల్లర్‌తో 22.1 గ్రాముల కార్బొహైడ్రేడ్స్‌, 1.1 గ్రాముల ప్రొటీన్‌ శరీరానికి అందుతుంది.


పుల్లటి వాటర్‌ : 

వేసవి ఈ పానీయం శరీరానికి ఎంతో చల్లదనాన్ని ఇస్తుంది. ఒక గ్లాసు నీటిలో దోసకాయ ముక్క, కొన్ని పుదీనా ఆకులు, నారింజ ముక్కలను ఉంచితో ఈ నీటిని పుల్లటి రుచి వస్తుంది. విటమిన్‌ సి కూడా అందులో సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయంలో యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలుంటాయి. వేడి దద్దుర్ల నుంచి రక్షిస్తుంది.


నిమ్మకాయ, పుదీనా పానీయం : 

ఒక గ్లాసు నీటిలో కొన్ని పుదీనా ఆకులు, నిమ్మముక్కలు ఉంచి 15 నిముషాలు మరిగించాలి. అది చల్లారిన తర్వాత తేనె కలపాలి. ఇది వేసవి వేడి, నిర్జలీకరణం నుంచి మనల్ని రక్షించడానికి దోహదపడుతుంది.


ఆరెంజ్‌ జ్యూస్‌ : 

ఆరెంజ్‌ నుంచి జ్యూస్‌ తీసి దానికి చిటికెడు ఉప్పు కలపాలి. ఈ పానీయంలో విటమిన్‌ సి, ఎలక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. నిర్జలీకరణ నుంచి రక్షిస్తుంది. ఇది కూడా ఉత్తమమైన ఆరోగ్యకరమైన వేసవి పానీయాల్లో ఒకటిగా చెప్పొచ్చు.
వెన్నతీసిన పాలు : ఈ పానీయంలో ప్రొటీన్లు సమృద్ధిగా కేలరీలు తక్కువగా ఉంటాయి. వేడిని తగ్గించటానికి ఇవి దోహదపడతాయి. దాహార్తిని తీరుస్తుంది. ఆకలి పెరుగుతుంది.

పెరుగు పానీయం : 

ఒక కప్పు పెరుగులో కొంత నీరు, జీలకర్ర, అల్లం ముక్కలు, చిటికెడు ఉప్పు వేయాలి. ఈ పానీయం తయారుకావటానికి బాగా కలపాలి. దీనిలో మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్‌). ఆక్సీకరణ, ఎలక్ట్రోలైట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇది నిర్జలీకరణం నుంచి కాపాడుతుంది.

రోజ్‌ వాటర్‌ : 

నీటిలో కొంచెం కుంకుమ పువ్వు, తాజా గులాబీ రేకులు వేసి కొంచెంసేపు మరగించాలి. రాత్రిపూట అలా ఉంచి మరుసటి రోజు ఉదయం తేనె కలపాలి. ఈ సీజన్‌లో ఉత్తమ వేసవి పానీయాల్లో ఇది కూడా ఒకటి.


ఐస్‌తో బటర్‌మిల్క్‌ : 

కొంత పెరుగును తీసుకుని దానికి ఉప్పు, కొద్దిగా తేనె, స్ట్రాబెర్రీ గుజ్జు, కొన్ని ఎండిన పుదీనా ఆకులు కలపాలి. చల్లగా కావాలనుకుంటే కొన్ని ఐస్‌ క్యూబ్స్‌ కూడా వేసుకోవచ్చు. ఈ పానీయాన్ని తీసుకుంటే మనల్ని తాజాగా ఉంచుతుంది.


కర్బూజా, పుచ్చకాయ పానీయం : 

కర్బూజా, పుచ్చకాయ ముక్కలను జ్యూసర్‌లో వేసి జ్యూస్‌ తీయాలి. దీనికి అర స్పూన్‌ తేనె, చిటికెడు ఉప్పు కలపాలి. కొంచెం జీలకర్ర, తాజా పుదీనా ఆకులను కలపాలి. ఆ తర్వాత సేవిస్తే అధిక చెమటలను తగ్గిస్తుంది. శరీరం చల్లగా ఉంటుంది.



  కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలు


కొబ్బరినీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. లేత కొబ్బరి నీళ్లలో అనేక సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌, పొటాషియం, సోడియం అత్యధికంగా ఉండి శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెంచి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.


– ఈ నీటిలోని కాల్షియం ఎముకల్ని, పళ్ళను దృఢంగా ఉంచి, కండరాల బలోపేతానికి సహకరిస్తుంది.


– శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.


– మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి పోషకాలు ఉన్న కొబ్బరి నీరు తాగడం వల్ల గర్భవతులకు మలబద్దకం, జీర్ణకోశంలో సమస్యలు తలెత్తవు.


– పాలిచ్చే తల్లులు ఈ నీళ్లు తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు ఈ పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో చేరి లారిక్‌ యాసిడ్‌ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలు అనేక ఇన్‌ ఫెక్షన్ల నుంచి రక్షించబడతారు.


– పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి.

– కొబ్బరి నీరు మూత్రకోశ ఇన్‌ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో సహాయపడతాయి.

– రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.

చర్మ సమస్యలు పోవాలంటే ….


వర్షాకాలంలో సహజంగానే అనారోగ్య సమస్యలు ఎక్కువ. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు, సీజనల్‌ వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మరోవైపు చర్మ సంబంధిత సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. వర్షపు నీరు, ఉక్కపోత, చెమట కారణంగా చర్మంపై దద్దుర్లు, దురద ప్రధానంగా కన్పిస్తుంటుంది. అయితే కొన్ని వంటింటి చిట్కాలతో సులభంగానే ఈ సమస్యల్నించి గట్టెక్కవచ్చంటున్నారు చర్మ వైద్య నిపుణులు.


- స్నానానికి ముందు ఒక స్పూన్‌ బేకింగ్‌ సోడాలో నిమ్మరసం పిండుకుని మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి ముందు మొత్తం శరీరానికి మర్దనా చేసి 15-20 నిమిషాలుంచాలి. ఆ తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురద సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు.


– ఒక గిన్నెలో వేడి నీళ్లు తీసుకొని అందులో వేపాకులు వేయాలి. ఆ నీళ్లను స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి. ఇలా వారానికి 3 సార్లు చేస్తే దురద సమస్యల్నించి గట్టెక్కవచ్చు.

– చర్మ సంబంధిత సమస్యల్ని దూరం చేసేందుకు కొబ్బరి నూనె అద్భుతమైన ఔషధంగా చెప్పవచ్చు. సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా స్నానానికి ముందు కొబ్బరినూనెను శరీరానికి మర్దన చేసుకుంటే చర్మానికి పోషక గుణాలు అందించడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌ నుంచి దూరం చేస్తుంది.

 మూడు వేల అడుగులతో రక్తపోటు నియంత్రణ 

రోజుకు మూడువేల అడుగులు వేస్తే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, అధిక రక్తపోటును తగ్గించవచ్చని తాజా అధ్యయనం కనుగొంది. రక్తపోటు నిపుణుడు అయిన పెస్కాటెల్లో.. అయోవా స్టేట్‌ యూనివర్సిటీలో డక్‌ చున్‌ లీ ల్యాబ్‌లో ఎలిజబెత్‌ లెఫెర్ట్స్‌ అనే మరికొంతమంది పరిశోధకులతో కలిసి ఈ అధ్యయనం చేశారు. 

రక్తపోటుకు సంబంధించి వారు చేసిన ఈ పరిశోధన జర్నల్‌ ఆప్‌ కార్డియోవాస్కులర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ డిసీజ్‌లో ప్రచురితమైంది. వయసుపైబడిన వారు అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. వీరు ఈ వయసులో రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని పెంచడం వల్ల వారికి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయా లేదా అన్న కోణంలో ఈ పరిశోధన చేశారు. అయితే తాజా అధ్యయనానికి ముందు రోజుకు సగటున నాలుగు వేల అడుగులు వేసిన వృద్ధులపై అధ్యయనం చేశారు. అయితే నాలుగువేల అడుగులు అంటే మరీ ఎక్కువ సమయం పడుతుండటంతో ఎక్కువ శారీరక శ్రమ వల్ల వారు అలసటకు గురయ్యే అవకాశం ఉంది. అందుకని రక్తపోటు నియంత్రణకు రోజుకు సగటున 3 వేల అడుగులు నడవడం సహేతుక లక్ష్యమని పరిశోధకులు నిర్ణయించారు. 

కోవిడ్‌ మహమ్మారి ఉన్న సమయంలోనే ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు పరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వృద్ధులకు పెడోమీటర్లు, రక్తపోటు మానిటర్లు, స్టెప్‌ డైరీలతో కూడి ఓ కిట్‌ను పరిశోధకులు వారికిచ్చారు. రోజూ వారు ఎన్ని వేల అడుగులు వేస్తున్నారో పరిశీలించారు. ఇందులో పాల్గొన్న 21 మందిలో ఎనిమిది మంది అధిక రక్తపోటు నిరోధక మందులు వాడుతున్నారు. వీరంతా రోజూ చేసే వాకింగ్‌ సమయాన్ని మరికొంతసేపు పెంచడం వల్ల.. రక్తపోటు నియంత్రణలో ఉందని పరిశోధకులు గమనించారు. ఈ అధ్యయనంలో రక్తపోటు నియంత్రణకు శారీరక శ్రమ ముఖ్యమని పరిశోధకులు కనుగొన్నారు.

  వీటిని తిన్న తర్వాత టీని ఎప్పుడూ తాగకూడదు…

టీ, కాఫీలు ప్రతిరోజూ తీసుకుంటూనే ఉంటాం. కానీ కొంతమందైతే.. టిఫిన్‌, భోజనం చేసిన తర్వాత కూడా టీ తాగుతూనే ఉంటారు. ఈ అలవాటు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి కొన్నింటిని తీసుకున్న తర్వాత టీని అస్సలు తాగకూడదని డాక్టర్లు చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందామా…!

సిట్రస్‌ ఫ్రూట్స్‌
లెమన్‌ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ లెమన్‌ టీ కాకుండా.. మాములు టీ తాగేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన రెసిపీలను తీసుకోకూడదు. ఎందుకంటే టీ, నిమ్మకాయ రెండూ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఈ రెంటినీ కలిపి తీసుకుంటే.. గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ నిమ్మకాయతో చేసిన పదార్థాల్ని తిన్న తర్వాత టీని తాగకూడదని వైద్యులు చెబుతున్నారు.

ఐరన్‌ ఫుడ్స్‌
ఐరన్‌ ఉన్న ఫుడ్స్‌ని తీసుకున్నప్పుడు వెంటనే టీని తాగకూడదు. ఇలా తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

స్పైసీ ఫుడ్స్‌
స్పైసీ ఫుడ్స్‌ తిన్న తర్వాత టీని తాగకూడదు. స్పైసీ ఫుడ్స్‌ కడుపులో మంటను కలిగిస్తాయి. వీటితోపాటు టీని తాగితే జీర్ణవ్యవస్థపై ప్రభావం పడుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఐస్‌క్రీమ్‌లు
బాగా చల్లని పదార్థాలు తీసుకున్న తర్వాత కూడా టీని తాగకూడదు. ఐస్‌క్రీమలు లేదా కూల్‌డ్రింక్స్‌ తాగిన తర్వాత కనీసం అరంగంట తర్వాతనే టీ తాగాలి అని వైద్యులు సూచిస్తున్నారు.

  గొంతు గర గర పోవాలంటే …


ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నాయి. ఈ సమయంలో బ్యాక్టీరియా మన శరీరంపై దాడికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా గొంతు సమస్యలు తెగ ఇబ్బంది పెడతాయి. గొంతులో గరగరగా ఉందంటే మన శరీరంలోకి ఏవో బ్యాక్టీరియా ప్రవేశిస్తోందని, వాటిపై మన రోగ నిరోధక శక్తి పోరాడుతోందని అర్థం. జలుబు, జ్వరం, అలెర్జీలు, కాలుష్యం, పొగ వంటివి గొంతు గరగరకు దారితీస్తాయి. దీన్ని సులభంగా దూరం చేసుకోవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి.


– గోరు వెచ్చని పాలలో అర టీ స్పూన్‌ పసుపు వేసి తాగాలి. ఇలా చేస్తే గొంతులో గరగర మాయమవుతుంది.
– అల్లాన్ని పేస్ట్‌ చేసి, దాల్చిన చెక్కను పొడి చేసి, వాటితో టీ పొడి కలిపి టీ పెట్టుకొని తాగాలి. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుంది.
– అల్లాన్ని మెత్తగా నూరి, టీలో కలిపి ఐదు నిమిషాలు మరిగించి తాగినా మంచి ఫలితం ఉంటుంది.
– పుదీనా ఆకుల్ని నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించి, ఆకులు తీసివేసి, ఆ నీళ్లు తాగాలి.

మెట్లు ఎక్కి దిగితే.. ఆరోగ్య ప్రయోజనాలెన్నో..!

 ప్రతిరోజూ వాకింగ్‌, రన్నింగ్‌ వంటి వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అయితే సీజన్‌ మారినప్పుడు వ్యాయామాలు చేసేందుకు వాతావరణం అనుకూలించదు. అలాంటప్పుడు మెట్లు ఎక్కడం, దిగడం వంటి తేలికపాటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

– మెట్లు ఎక్కడం, దిగడం వంటి వ్యాయామాల వల్ల శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది. కానీ ఈ వ్యాయామాలు శారీరక బలంతోపాటు శక్తినిస్తాయి అని వైద్యులు చెబుతున్నారు.

– మెట్లపై చేతులు పెట్టి పైకి కిందకి లేస్తూ చేసే వ్యాయామాలు ఆరోగ్యాన్నిస్తాయి.

– రోజూ మెట్లు ఎక్కుతూ దిగుతూనే ఉంటాం. కానీ ఈ వ్యాయామం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టం. కానీ దీనివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.

– మెట్లపై బాడీని ఏటవాలుగా వంచి ఒక కాలు పైకి లేపుతూ.. దించుతూ వ్యాయామం చేయాలి. 

Friday, September 13, 2024

 ఈ అలవాట్లు.. క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయ్..!

మీకు ఈ అలవాట్లు గనుక ఉంటే.. క్యాన్సర్‌ ప్రమాద శాతం చాలా తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. మన జీవన శైలిలో ఈ అలవాట్ల వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందని బిఎంసి మెడిసన్‌ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం పేర్కొంది.


1. వ్యాయామం : ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. శారీరక శ్రమ తప్పనిసరి. వారంలో కనీసం 5 నుండి 10 గంటలైనా వ్యాయామం చేయాలి.

2. తృణధాన్యాలు : రోజువారీ తీసుకునే ఆహారంలో తృణధాన్యాలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలు, బీన్స్‌ వంటివి అధికంగా తీసుకోవాలి. రోజుకి కనీసం 30 గ్రాముల ఫైబర్‌ తీసుకోవాలి.

3. ఆరోగ్యకరమైన బరువు : వయసుకు తగ్గట్టుగా.. ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండాలి.

4. మాంసం : వారానికి అరకేజి కంటే తక్కువగానే మాంసాన్ని తినాలి.

5. కూల్‌డ్రింక్స్‌ : కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మంచిది.

6. మద్యం సేవించకూడదు : మద్యం సేవించకూడదు. ఒకవేళ డ్రింక్‌ చేసినా.. వారానికి 14 గ్లాసుల కంటే తక్కువగా డ్రింక్‌ చేయాలి.

7. ఫాస్ట్‌ ఫుడ్స్‌ : రోజులో ఫాస్ట్‌ ఫుడ్స్‌, పిజ్జాలు, బర్గర్లు వంటివి పరిమితంగా తీసుకోవాలి.

 ఊబకాయంతో బాధ పడుతున్నారా..?

అధిక బరువు, ఊబకాయంతో పిల్లలతో సహా  పెద్దవారు కూడా బాధ పడుతున్నారు. శరీరంలో అధిక స్థాయిలో కొవ్వు పదార్థం నిల్వ ఉండే పరిస్థితి అధిక బరువుకు కారణం అవుతుంది. ఆరోగ్యకరమైన బరువు కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.  

పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు, కొవ్వు రహిత లేదా తక్కువ కొవ్వు పాలు, పాల ఉత్పత్తులు ఆహార పదార్థాలు తీసుకోవాలి. శుద్ధి చేసిన ధాన్యాలు, స్వీట్లు, బంగాళదుంపలు, రెడ్‌ మీట్‌, ప్రాసెస్‌ చేసిన మాంసం, చక్కెర పానీయాలు వాడకూడదు. జంక్‌ ఫుడ్లకు దూరంగా ఉండాలి. శుద్ధి చేసిన తెల్ల చక్కెర, మైదా, అధిక ఫ్రక్టోజ్‌ కార్న్‌ సిరప్‌, సంతృప్త కొవ్వుతో తయారు చేయబడిన అత్యంత ప్రాసెస్‌ చేయబడిన ఆహారాన్ని తినకూడదు.  

చిన్న ప్లేట్లలో ఆహారాన్ని తినడం వలన బరువు తగ్గవచ్చు. గర్భధారణ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకోడానికి పుట్టిన పిల్లలకు 24 నెలల వరకు తల్లి పాలు ఇవ్వాలి. ప్రతి రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒకే దగ్గర కూర్చొని టి.వి చూడడం తగ్గించాలి. సరైన వేళకు ఆహారం తీసుకొని, తగినంత నిద్ర పోయి ఒత్తిడి తగ్గించుకోవాలి. బాల్య స్థూలకాయం మీద దృష్టిపెట్టాలి. కారణం బాల్య స్థూలకాయం యుక్తవయస్సు వరకు కొనసాగే అవకాశం ఉంది.

దీని వల్ల వ్యక్తికి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ తప్పకుండా వ్యాయామం చేయాలి. ఆహారపు అలవాట్లను మెరుగు పరచడం, శారీరక శ్రమను పెంచడం లాంటివి ఊబకాయం రాకుండా చేస్తాయి. ఊబకాయం, అధిక బరువులకు చికిత్స చేయడం కష్టం. కాబట్టి నివారణ చాలా ముఖ్యం.